రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఉక్రెయిన్ ఈ ఆరోపణలను పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కథనం ప్రకారం.. డిసెంబర్ 28-29 తేదీల మధ్య మాస్కోకు పశ్చిమాన ఉన్న నొవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ 91 లాంగ్-రేంజ్ డ్రోన్లను ప్రయోగించింది. రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేసినట్లు ఆయన తెలిపారు.

ట్రంప్‌కు పుతిన్ ఫోన్: సోమవారం ఉదయాన్నే పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ దాడి విషయం చెప్పారని ట్రంప్ వెల్లడించారు. “ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వేరు, కానీ ఏకంగా నివాసంపై దాడి చేయడం సరికాదు. దీనిపై నాకు చాలా కోపంగా ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ దాడి నిజంగా జరగలేదని కొందరు అంటున్నారని, దీనిపై తాము ఆరా తీస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీసేందుకు, ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేయడానికి రష్యా అల్లుతున్న కట్టుకథలివని ఆయన విమర్శించారు. ఈ దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిని పునఃసమీక్షిస్తామని రష్యా హెచ్చరించింది. అయినప్పటికీ, పుతిన్‌తో తన చర్చలు ఫలప్రదంగా సాగాయని, యుద్ధం ముగిసే ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
