మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు, ప్రశ్నపత్రం లీకేజీ జరిగాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
తాము మొదటి నుంచి లేవనెత్తుతున్న అంశాలు వాస్తవమేనని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించిందని అన్నారు.
డీఎస్సీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.
ఒకే అధికారికి కీలక బాధ్యతలు
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం వల్లే చెక్స్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ దెబ్బతిందని వైఎస్ జగన్ అన్నారు.
దీనివల్లే అక్రమాలకు అవకాశం ఏర్పడిందని ఆరోపించారు.
ప్రశ్నపత్రం తయారు చేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరుతో నవీన్ పేరును రెండో మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారని చెప్పారు.
ఈ వ్యవహారంపై బాధితుడు కోర్టును ఆశ్రయించడం ప్రభుత్వ అక్రమాలకు నిదర్శనమని వైఎస్ జగన్ ఆరోపించారు.
శాసనమండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోంది
శాసనసభలో తమపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.
అయితే శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని అన్నారు.
తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ హోదాను గుర్తించడం లేదని ఆరోపించారు.
ప్రతిపక్షం లేకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే సొంతంగా ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు.



