కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న జగన్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆయన, నంది విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి, పుష్పమాలలు సమర్పించారు.
విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్న జగన్, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు.ఆలయాల అభివృద్ధి ద్వారా గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యం విస్తరిస్తుందని, భక్తి మార్గం సమాజంలో శాంతిని పెంపొందిస్తుందని జగన్ పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ ఛైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని ఆయన అభినందించారు.జగన్ రాకతో నందిపల్లి గ్రామానికి భక్తులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

