ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.
‘హెరిటేజ్’ ప్రయోజనాల కోసమే తిరుమల లడ్డూపై విషప్రచారం చేశారని, సిట్ (SIT) నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందని, వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను టీడీపీ విభాగాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.ఎన్నికల హామీలైన తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం వంటి ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజల తరపున సభలో గర్జిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
