వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన జగన్, నేడు కేవలం 11 సీట్లకే పరిమితం కావడం ఆయన పాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వీరశివారెడ్డి వ్యాఖ్యానించారు. “రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండి ఉంటే, జగన్ ఈరోజు రాజకీయాల్లో ఉండేవాడు కాదు.. బెంగళూరుకే పరిమితం అయ్యేవాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ చేసిన పాదయాత్రను నమ్మి ప్రజలు గతంలో బ్రహ్మరథం పట్టారని, కానీ నేడు ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు.ఇప్పటికైనా జగన్ తన ధోరణి మార్చుకోవాలని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గళం విప్పాలని సూచించారు. అలా చేస్తేనే ప్రజలు భవిష్యత్తులో నేతగా గుర్తిస్తారని హితవు పలికారు.కడప జిల్లా రాజకీయాల్లో వీరశివారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
