రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ అనుసరిస్తున్న తీరుపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై వైసీపీ నేతల వైఖరిని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వానికి ‘అమరావతి’ ఒక్కటే రాజధాని అని క్లారిటీ ఉంది.
మరి వైసీపీకి రాజధాని ఎక్కడో ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో ‘మూడు ముక్కలాట’ ఆడి అమరావతిని సర్వనాశనం చేశారని, రైతులను, మహిళలను జైలుకు పంపిన చరిత్ర వైసీపీదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే టెండర్లు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగి పనులు ఆలస్యమయ్యాయని వివరించారు. ప్రస్తుతం అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో పనులు వేగంగా జరుగుతున్నాయని, దీనిపై పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోందని అన్నారు. సచివాలయంలో మంత్రులు, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు అన్నీ ఒకే చోట ఉండేలా సీఎం చంద్రబాబు దూరదృష్టితో డిజైన్ చేశారని తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లతో కలిసి రాజధాని రైతుల చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి పనుల్లో అన్ని టెండర్లు అత్యంత పారదర్శకంగా జరిగాయని, ఇక రాజధానిని ఆపడం ఎవరితరం కాదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
