వైఫల్యం అంతం కాదు.. మళ్లీ మొదలుపెట్టే అవకాశం
చాలాసార్లు ఓడిపోయినా తిరిగి ప్రయత్నించడమే నిజమైన గెలుపు. మనం అలసిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో భయపడవచ్చు. అయినా ప్రయత్నాన్ని ఆపకపోతే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
చాలామంది తమ పనులను రేపటికి వాయిదా వేస్తుంటారు. అలా చేస్తూ తమ లక్ష్యాలను కూడా దూరం చేసుకుంటారు. అయితే విజయం ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ వేసే చిన్న అడుగులే చివరికి పెద్ద మార్పును తీసుకొస్తాయి.
ఇదే విషయాన్ని అర్జున్ కథ చెబుతుంది.
ఒక ఫెయిల్యూర్ లెటర్ మార్చిన ఆలోచన
రాత్రి పదకొండు గంటలు. గదిలో లైట్ ఆపేసి అర్జున్ మంచంపై ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతిలో ఫెయిల్యూర్ లెటర్ ఉంది.
ఎన్నో రోజులుగా ఆశగా ఎదురుచూసిన ఉద్యోగం అతనికి దక్కలేదు.
“నా వల్ల కాదు..” అనే మాట అతని మనసులో పదేపదే వినిపిస్తోంది.
కొంతకాలం క్రితం వరకు అర్జున్ పెద్ద పెద్ద కలలు కనేవాడు. ఇప్పుడు మాత్రం చిన్న విషయాలకే భయపడుతున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే.. “నేను పనికిరాను” అనుకునేవాడు. బిజినెస్‌లో నష్టం వస్తే.. “నాకు ఏదీ చేతకాదు” అని భావించేవాడు. ప్రేమలో విఫలమైతే.. “నన్నెవరూ ప్రేమించరు” అనుకునేవాడు.
ఇలా ప్రతి ఓటమి అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది.
అద్దం ముందు అర్జున్‌కు వచ్చిన ప్రశ్న
ఆ రాత్రి అర్జున్ అద్దం ముందు నిలబడ్డాడు. తన కళ్లలోకి తానే చూశాడు.
“చివరిసారిగా నేను గెలుస్తానని ఎప్పుడు నమ్మాను?” అని తనను తాను ప్రశ్నించుకున్నాడు.
సమాధానం రాలేదు.
కొద్దిసేపటి తర్వాత మరో ప్రశ్న వేసుకున్నాడు.
“జీవితం కొట్టిన ప్రతి దెబ్బతో నేను కూడా ‘నా వల్ల కాదు’ అని అనుకోవడం మొదలుపెట్టానా?”
ఈసారి అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
అతను అలసిపోయాడు. కానీ ఓడిపోలేదు.
ఎన్నో సమస్యలు ఎదురైనా అర్జున్ ఇంకా నిలబడే ఉన్నాడు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిచినా ముందుకు వెళ్లాలని చూస్తున్నాడు.
అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది.
అలసిపోవడం అంటే ఓడిపోవడం కాదు.
“నేను పడిపోయాను.. కానీ ఓడిపోలేదు”
మళ్లీ అద్దం ముందు నిలబడిన అర్జున్ ఈసారి నిరాశకు తలవంచలేదు.
“నేను పడిపోయాను. కానీ ఓడిపోలేదు” అని గట్టిగా చెప్పుకున్నాడు.
అతని మనసులో కొత్త ఆలోచన మొదలైంది.
“నా జీవితంలో కొత్త చాప్టర్ ఈరోజే మొదలవుతుంది.”
ఆ చాప్టర్ పేరు I AM A WINNER.
అర్జున్‌కు మరో విషయం కూడా స్పష్టమైంది. ఫెయిల్యూర్ తన ఐడెంటిటీ కాదు. అది ఒక పాఠం మాత్రమే.
పడిపోవడం తప్పు కాదు. అయితే పడిపోయిన చోటే ఉండిపోవడం అసలు ఓటమి.
భయం, బద్ధకం, “రేపు చూద్దాం”కు చెక్
మరుసటి రోజు ఉదయం అర్జున్ ఫోన్ తీసుకోలేదు. సోషల్ మీడియా కూడా చూడలేదు. ఇతరులతో తన జీవితాన్ని పోల్చుకోలేదు.
బదులుగా తన లక్ష్యాన్ని ఒక కాగితంపై రాశాడు.
“నేను ఎందుకు గెలవాలి?”
తన కోసం.. తన కుటుంబం కోసం.. తన కలల కోసం.. తనను తాను మళ్లీ గౌరవించుకోవడం కోసం.
అయితే అతని జీవితం ఒక్కరోజులో మారిపోలేదు.
సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ అర్జున్ ఆలోచన మారింది.
ముందు సమస్య వస్తే వెనక్కి తగ్గేవాడు. ఇప్పుడు “దీనినుంచి నేను ఏం నేర్చుకోవాలి?” అని ఆలోచిస్తున్నాడు.
ముందు విమర్శలు వస్తే బాధపడేవాడు. ఇప్పుడు తన పని మీద దృష్టి పెడుతున్నాడు.
అలాగే, ముందు “రేపు చూద్దాం” అనేవాడు. ఇప్పుడు చిన్నదైనా ప్రతిరోజూ ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు.
చిన్న అడుగులే పెద్ద విజయానికి పునాది
రోజులు గడిచాయి. అర్జున్ కష్టానికి వెంటనే ఫలితం రాలేదు.
ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఎవరూ అతన్ని అభినందించలేదు. అయినా అతను ఆగలేదు.
ఎందుకంటే ఒక విత్తనం నేల కింద పెరుగుతున్నప్పుడు దాని ఎదుగుదల బయట కనిపించదు. ఒకరోజు అదే విత్తనం మొక్కగా మారుతుంది.
అర్జున్ పరిస్థితి కూడా అలాంటిదే.
బయటికి పెద్ద మార్పు కనిపించకపోయినా.. లోపల అతను తనను తాను మార్చుకుంటున్నాడు.
చివరకు వచ్చిన విజయం
ఒకరోజు అతనికి మరో అవకాశం వచ్చింది.
అర్జున్ పరీక్ష రాశాడు. ఫలితాల రోజు వచ్చింది.
ఈసారి అతని పేరు విజయవంతుల జాబితాలో ఉంది.
ఆ జాబితాను చూస్తూ అర్జున్ కొద్దిసేపు నిలబడ్డాడు. అయితే అతనికి ముందుగా గుర్తొచ్చింది విజయం కాదు.
ఆ ఓటములు గుర్తొచ్చాయి. కన్నీళ్లు గుర్తొచ్చాయి. నిద్రలేని రాత్రులు గుర్తొచ్చాయి. “నా వల్ల కాదు” అని అనుకున్న రోజులు గుర్తొచ్చాయి.
అద్దం ముందు తనను తాను ప్రశ్నించిన ఆ రాత్రి కూడా గుర్తొచ్చింది.
అతను చిరునవ్వు నవ్వాడు.
ఎందుకంటే అప్పుడే అతనికి ఒక నిజం పూర్తిగా అర్థమైంది.
విన్నర్ అంటే ఎప్పుడూ గెలిచేవాడు కాదు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ లేచేవాడే నిజమైన విజేత.
విజేత ఎవరు?
అందరూ వెళ్లిపోయినా తన కలతో ముందుకు నడిచేవాడే విజేత.
ఎవరూ చప్పట్లు కొట్టకపోయినా తన పనిని ఆపనివాడే విజేత.
భయం ఉన్నప్పటికీ ముందుకు అడుగు వేసేవాడే విజేత.
వైఫల్యం వచ్చినప్పుడు దానిని పాఠంగా తీసుకునేవాడే విజేత.
అందుకే గెలుపు అంటే కేవలం ఫలితం కాదు. ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యం కూడా గెలుపులో భాగమే.
“I AM A WINNER”
అర్జున్ మరోసారి అద్దం ముందు నిలబడ్డాడు.
ఈసారి అతని కళ్లలో ఓటమి లేదు.
తన గుండె మీద చెయ్యి పెట్టుకున్నాడు.
“నా పరిస్థితి నా భవిష్యత్తును నిర్ణయించదు. నా గతం నన్ను ఆపదు. నేను పడిపోవచ్చు. కానీ లేవకుండా ఉండను. నేను ఆగను. నా కలలను వదలను” అని చెప్పుకున్నాడు.
చివరగా చిరునవ్వుతో అన్నాడు..
“I am a winner.”
ఆ రోజు అర్జున్ తెలుసుకున్న గొప్ప నిజం ఒక్కటే.
జీవితం మనల్ని వందసార్లు కింద పడేయవచ్చు. కానీ మనం 101వసారి లేస్తే.. ఓడిపోయింది మనం కాదు.. ఓటమి.
కాబట్టి నీ జీవితం ఇప్పుడు కష్టాల్లో ఉంటే దాన్ని ముగింపుగా భావించకు.
అది ఇంటర్వెల్ మాత్రమే.
నీ కథ ఇంకా పూర్తికాలేదు.
అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది.
I AM A WINNER..
YOU ARE A WINNER..
WE ARE WINNERS.


