విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో బాధించిందని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు స్పందించిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు స్థానిక అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వేడి ఉక్కు ద్రవం ఉన్న ల్యాడిల్ విస్ఫోటనం చెందడంతో 9 మంది కార్మికులు మృతి చెందడం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించి, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఉక్కు ద్రవంతో కూడిన భారీ ల్యాండిల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వందల టన్నుల ఉక్కు ద్రవం నేలపై పడటంతో అక్కడ విధుల్లో ఉన్న 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

