జనసేన ఆశయ సాధనే లక్ష్యం

February 15, 2026 7:30 PM


సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ కళ్యాణ్

మంగళగిరి (బీఎన్ఎస్): జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా తొలి సభ్యత్వాన్ని తీసుకోవడమే కాకుండా, పార్టీ కోసం రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

సభ్యత్వాల్లో మూడు విభాగాలు: ఉద్యమి, సాధక్, ప్రదాత
పార్టీ కోసం పనిచేసే వారి సేవలను గుర్తించేలా ఈసారి సభ్యత్వ నమోదులో పవన్ కళ్యాణ్ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులను వారి సేవా దృక్పథం ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు:

ఉద్యమి: పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను లోతుగా అర్థం చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని ‘ఉద్యమి’గా పిలుస్తారు.

సాధక్: పార్టీ పోరాటాలకు బలాన్ని చేకూరుస్తూ, యువతలో స్ఫూర్తి నింపే వారిని ‘సాధక్’గా గుర్తిస్తారు.

ప్రదాత: పార్టీకి ప్రత్యక్షంగా కాకపోయినా.. ఆర్థికంగా, మేధోపరంగా, సాంకేతికంగా సహాయ సహకారాలు అందించే వారిని ‘ప్రదాత’గా పరిగణిస్తారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. “రాజకీయాల్లో మార్పు అనేది ఒక్క రోజుతో వచ్చేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. జనసేన కేవలం అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు, సమాజంలో జవాబుదారీతనం పెంచడానికి వచ్చిన పార్టీ. ప్రతి జనసైనికుడు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఎదగాలి.” అని అన్నారు. 150 మందితో ప్రారంభమైన పార్టీ, నేడు 12.98 లక్షల సభ్యత్వాలకు చేరుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. పార్టీ సభ్యులు క్రమశిక్షణతో ఉంటూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం పొందిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, గతంలో మాదిరిగానే ప్రమాద బీమా సౌకర్యం వంటి ప్రయోజనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media