అదృశ్యమైన ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణ హత్యకు గురికావడంతో మదనపల్లెలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. చిన్నారి మృతదేహం డ్రమ్ములో లభించిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మదనపల్లె-కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లి మార్కెట్ యార్డ్ వద్ద చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. YSRCPనియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఈ ధర్నాలో పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు. నిందితుడిని వెంటనే గుర్తించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే నిందితుడి కోసం గాలింపు వేగవంతం చేసిన పోలీసులు, నిందితుడు అదుపులోకి వచ్చిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని భరోసా ఇచ్చారు.
