నగరంలోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థులు వీరంగం సృష్టించారు. వినాయక్ నగర్ బస్తీలో ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం కాస్తా గ్యాంగ్ వార్‌కు దారితీసింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపై పరస్పరం పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.
ఈ ఆకస్మిక ఘర్షణతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు విద్యార్థులు రాళ్లు, కర్రలతో కూడా దాడులు చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా బహిరంగంగా గొడవలకు దిగడంపై స్థానికులు మరియు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
