సైబర్ నేరగాళ్లపై అదిలాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాత మొబైల్ ఫోన్ల ముసుగులో డేటా చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు.
ఏం జరుగుతోంది?
ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు (ఒకరు మైనర్) అదిలాబాద్ పరిసరాల్లో తిరుగుతూ ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకు పాత ఫోన్లను సేకరిస్తున్నారు. ఈ ఫోన్లలోని మదర్‌బోర్డులు, బ్యాటరీలను వేరు చేయడమే కాకుండా, కస్టమర్ల పాత డేటా మరియు IMEI నంబర్ల ద్వారా బ్యాంక్ అధికారులమని నమ్మించి ఓటీపీలు పొంది ఖాతాల నుంచి డబ్బులు కాజేయడమే వీరి ప్లాన్. ఆదివారం ఎన్టీఆర్ చౌక్ వద్ద తనిఖీల్లో పట్టుబడిన వీరి వద్ద నుంచి సుమారు 1500 సెకండ్ హ్యాండ్ ఫోన్లు, భారీగా మదర్ బోర్డులు, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.ప్రజలు తమ పాత ఫోన్లను తెలియని వ్యక్తులకు తక్కువ ధరకు విక్రయించవద్దని ఎస్పీ సూచించారు. మీ ఫోన్ ద్వారా మీ డేటాను సేకరించి, ఇతర రాష్ట్రాల నుంచి మీ పేరిటే నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
