కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం కామారెడ్డిలో ఎమ్మెల్యేను పరామర్శించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కామారెడ్డిలో ఓడిపోయానన్న కక్షతో రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంపై కుట్ర చేస్తున్నారని, కొడంగల్‌కు రూ. 10 వేల కోట్లు ఇచ్చి కామారెడ్డిని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీని సీఎం ‘కట్టప్ప’లా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. షబ్బీర్ అలీ వెనుక రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఉన్నారని ఆరోపిస్తూ.. దీనిపై సిబిఐ (CBI) విచారణ జరపాలని కోరారు. షబ్బీర్ అలీకి సౌదీ వెళ్లడానికి వీసా తానే ఇప్పిస్తానని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు ఎలా చేస్తారని మంత్రి సీతక్కను నిలదీశారు.రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో పాదయాత్ర చేస్తామని, సచివాలయంపై కషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హిందువులను అవమానించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు.
