మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తుండటాన్ని గమనించిన స్థానికులు మరియు బీజేవైఎం (BJYM) నాయకులు అతడిని అడ్డుకుని దేహశుద్ధి చేశారు.
అయ్యప్ప ఆలయంపై ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నాడన్న వార్తతో స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు హడావిడి, గందరగోళం ఏర్పడింది.సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు జుబేర్ అని తెలుస్తోంది. అయితే అతడు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిందూ దేవాలయంపై నమాజ్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని బీజేవైఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి.ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
