గ్రామ ప్రథమ పౌరురాలు అనే గౌరవం లేకుండా ఒక మహిళా సర్పంచ్‌ను ఉపసర్పంచ్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట్ గ్రామంలో వెలుగుచూసింది. పంచాయతీ భవనంలోకి సర్పంచ్‌ను రానివ్వకుండా ఉపసర్పంచ్ కుర్చీ అడ్డువేసి విధులకు ఆటంకం కలిగిస్తున్నాడంటూ బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

గండిపేట్ సర్పంచ్ అనూష, ఉపసర్పంచ్ కాశీరాం మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. పంచాయతీ భవనం ఇరుకుగా ఉండటంతో, ఉపసర్పంచ్ కాశీరాం తనకు ప్రత్యేకంగా కుర్చీ లేదన్న నెపంతో స్వయంగా ఒక కుర్చీ తెచ్చుకుని భవనం ప్రవేశ ద్వారానికి అడ్డంగా వేసుకున్నాడు. ఉపసర్పంచ్ అడ్డంగా కూర్చోవడంతో సర్పంచ్ అనూష లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీనిపై ప్రశ్నిస్తే ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల సమయంలో ఉపసర్పంచ్ ఫోన్లో ఇతరులతో అసభ్య పదజాలంతో మాట్లాడుతుండటంతో మహిళా సర్పంచ్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఉపసర్పంచ్ తీరుతో విసిగిపోయిన అనూష.. సర్పంచుల ఫోరం నేతలతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన విధులకు ఆటంకం కలిగిస్తున్న కాశీరాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
