ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసి లైంగికంగా దుర్వినియోగం చేసిన ఘటనలో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం పాయకరావుపేటకు చెందిన 17 ఏళ్ల బాలిక విశాఖపట్నం ఎన్‌ఏడీ సమీపంలోని ఎస్‌ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ సమయంలో విశాఖపట్నం చిన్న గాదిలి రాధాకృష్ణ నగర్‌కు చెందిన ధల్లి సాయి చందు (20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో తరచూ వేధిస్తూ అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

2025 ఏప్రిల్‌లో పాయకరావుపేటలోని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లి బాలికతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆమెకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లి దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.బాధితురాలు ఇటీవల తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో ఫిర్యాదు నమోదైంది. దీంతో పాయకరావుపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు సీఐ జి. అప్పన్న పర్యవేక్షణలో కొనసాగుతోంది. నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితుడు మరియు అతని తల్లి యమునాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
