జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచే జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అక్రిడిటేషన్ విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, జర్నలిస్టుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.ఇళ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
