వేములవాడ, ఏప్రిల్ 2026: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్న క్షేత్రంలో సందడి చేశారు. బుధవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆయన కుటుంబ సమేతంగా భీమేశ్వరాలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదాశీర్వచనం అందించారు.
సర్వేజనా సుఖినోభవంతు
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. “రాములోరి పెళ్లి అంటే అది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, యావత్ లోక కల్యాణం కోసం జరిగే వేడుక. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ఆకాంక్షతో దేశవ్యాప్తంగా ఈ కళ్యాణ ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
ప్రజా పాలనకు దైవాశీస్సులు
రాష్ట్ర అభివృద్ధిపై తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. “స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నాను. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా మన ‘ప్రజా పాలన’ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగాలని ఆ భగవంతుడిని వేడుకున్నాను” అని మంత్రి వివరించారు.
వేడుకగా రాములోరి కళ్యాణం
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంత్రి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
