విశ్వమంగళ్య సభ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 4 మరియు 5 తేదీలలో భాగ్యనగరంలో ‘మాతృ సంస్కార్ సమాగమ్’ పేరుతో రెండు రోజుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

ఈ సమ్మేళన ప్రధాన లక్ష్యం మాతృత్వంలోని సహజ శక్తిని మేల్కొల్పడం, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేయడం ద్వారా విలువలతో కూడిన ‘నవ భారత్’ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం అని పేర్కొన్నారు.2010లో స్థాపించబడిన విశ్వమంగళ్య సభ సంస్కార్, సామర్థ్య, సదాచారం, సేవ అనే నాలుగు సూత్రాలపై దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్ తరాలకు జీవన విలువలను అందించడంలో తల్లుల పాత్ర అత్యంత కీలకమని, మాతృత్వాన్ని దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామని వివరించారు.రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతన, సామాజిక అభివృద్ధి, మహిళల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన చర్చాగోష్టులు, ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
