బొబ్బిలి, (విజయనగరం) ఏప్రిల్ 5 : రాష్ట్ర పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బొబ్బిలికి వరాల జల్లు కురిపించారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఆయన మూడున్నర కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదివారం బొబ్బిలిలో పర్యటించారు. రాణి మల్లమ్మదేవి పార్కును సందర్శించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. బొబ్బిలి బైపాస్ రోడ్డుకి రూ.2 కోట్లు, పట్టణంలో రహదారుల నిర్మాణానికి రూ.కోటి, మల్లమ్మదేవి పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా రూ.123 కోట్లతో మంజూరైన త్రాగునీటి పథకం నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. అదేవిధంగా డ్రైనేజీ అభివృద్ధి కోసం రూ.14 కోట్లు మంజూరు ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్టీపీ నిర్మాణానికి కూడా రూ.26 కోట్లు మంజూరు చేసేందుకు కూడా కృషి చేస్తామని అన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ, బొబ్బిలి అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలను వివరించారు. నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సి ప్రభాకర్, ఆర్డీవో మోహనరావు, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, పలువురు జిల్లా అధికారులు, మండల అధికార్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
