అమరావతి BNS ఏప్రియల్ 7: రాష్ట్రాన్ని డిజిటల్ భద్రతలో అగ్రగామిగా నిలపాలనే దూరదృష్టితో, దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో కూడిన “సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ (APCSOC)” ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు.. దీని ద్వారా ప్రభుత్వ విభాగాలు, కీలక మౌలిక వసతులు, పౌరుల డేటాకు సమగ్ర రక్షణ కల్పిస్తూ, సైబర్ ముప్పులను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. మంగళవారం విజయవాడ కానూరు లోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) మరియు సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ వినూత్న ఆలోచనతో, దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా 1,000 కి పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ తెలిపారు. మన మిత్ర డిజిటల్ పాలనలో సరికొత్త అధ్యాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా నిమిషాల్లో సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. అందుబాటులో ఉన్న ప్రధాన సేవలు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, కుల, ఆదాయ ధృవపత్రాలు, భూమి పాస్‌బుక్ వివరాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ దరఖాస్తులు, ఆరోగ్యశ్రీ, హాల్ టికెట్లు, పరీక్షా ఫలితాలు, తిరుమల సహా ప్రముఖ ఆలయాల దర్శనం, వసతి బుకింగ్స్, ఆర్టీసీ టికెట్లు అందిస్తుందన్నారు. విద్యార్థులు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం అంత మంచిదికాదని సూచించారు. అనుమానాస్పద లోన్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలన్నారు. వీడియో లైక్ చేస్తే డబ్బులు వస్తాయనే స్కామ్‌లను నమ్మవద్దన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో యువతను ప్రోత్సహించేందుకు ఏపీటీఎస్ ప్రతి ఏటా హ్యాకథాన్‌లు నిర్వహిస్తోందని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 స్టైఫండ్ తో ఇంటర్న్ షిప్ సదుపాయం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.
ఏపీటీఎస్ ప్రతినిధులు శ్రీనివాస్, దినేష్ లు సైబర్ మోసాల పై విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు..
కార్యక్రమంలో వీఆర్ సిద్ధార్థ కళాశాల వైస్ ఛాన్సలర్ డా. పి. వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్ డా. జె. శివరామ్ ప్రసాద్ లు పాల్గొన్నారు.

