పక్కాగా భూమి రికార్డులు ఇవ్వటమే ధ్యేయం

April 9, 2026 7:07 PM

2027 మార్చికి 1.12 కోట్ల పాస్ పుస్తకాల పంపిణీ

సూరేపల్లి ( BN) S ఏప్రిల్ 9: రాష్ట్రంలో భూ సమస్యలను లేకుండా చేసేందుకు ప్రభుత్వం పని చేస్తోందని, 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టదారు పాసుపుస్తకాలను పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పాసుపుస్తకాలు అందింస్తున్నామని తెలిపారు. ఆటో మ్యుటేషన్ తర్వాత నేరుగా ఇంటికి పాస్ పుస్తకాలను పంపాలని అధికారులను ఆదేశించారు.

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లి గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. వేదికపై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. వారి సమక్షంలోనే పొలం వివరాలను అధికారులతో చదివి వినిపించారు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”గత పభుత్వంలో ప్రజల భూమిపై కన్నేసి కబ్జాలు చేశారు. ప్రశ్నించిన వారిని కట్టడి చేసేందుకు బ్లాక్ మెయిల్ చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రతీ గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపి భయానక వాతావరణం సృష్టించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపైనా జగన్ తన ఫోటో వేసుకున్నాడు. సరిహద్దు రాళ్లపైనా బొమ్మలు చెక్కించుకున్నాడు. ఇందుకోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. వారు అధికారం నుంచి దిగిపోయినా పాపాలు, అక్రమాలు ఇంకా వెంటాడుతున్నాయి. అంతలా రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతీ నెల నేను స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాను. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు. భద్రత, జీవనాధారం. అర్జీల్లో రెవెన్యూ సమస్యలవే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని సంకల్పించాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వే 2.0 చేపట్టాం. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీ సర్వే పూర్తి చేసి ప్రతి ఒక్కరికి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. ఈ జనవరి నుంచి మార్చి వరకు 21.23 లక్షల కొత్త పాసుపుస్తకాలు ఇచ్చాం. ఈ నెలలో 356 గ్రామాల్లో 1,56,433 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. జూలై నాటికి మరో 9 లక్షల పట్టాదారు పుస్తకాలు ఇస్తాం. 11,099 గ్రామాల్లో కొత్తగా ఇవ్వాల్సిన 80 లక్షలు పాస్‌ పుస్తకాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పంపిణీ చేస్తాం. 1.10 కోటి మందికి పాస్ పుస్తకాలు ప్రజలకు అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీనే పాస్ పుస్తకాలకూ వాడుతున్నాం. భవిష్యత్‌లో ఎవరూ రికార్డులు తారుమారు చేయలేరు. రాజీలేకుండా మూడుసార్లు పట్టాదారుకు చెప్పి ఈ కేవైసీ చేస్తున్నాం. రికార్డులు ట్యాంపరింగ్ చేయకుండా వాటిని భద్రపరిచేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. రికార్డుల లాకర్ సిస్టమ్ తెచ్చాం. దీని ద్వారా భూ యజమానులు ఆధార్, ఈ కేవైసీ ఇచ్చి తమ భూముల రికార్డులు లాక్ చేసుకోవచ్చు. రికార్డ్ లాకింగ్ అనేది రక్షణ కవచంగా ఉంటుంది. ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media