ములుగు (బీఎన్ఎస్) యోగ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజువారి జీవనశైలిలో యోగ ప్రక్రియను ఒక భాగంగా దినచర్య అలవర్చుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు జిల్లా బండారుపల్లి గిరిజన భవన్ లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్ లో భాగంగా హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ 271వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ హోమియోపతి ( ఆయుష్ డే ) దినోత్సవ యోగ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర తో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ యోగా చేయడం ద్వారానే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రజల దినచర్యలో యోగా ఒక భాగంగా అలవర్చుకోవాలని ఉదయం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు యోగ చేయడం ద్వారా శరీరం మెదడు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. పురాతన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా మాత్రమే మనిషి తన ఆశలను ఆశయాలను ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యోగ దినచర్యగా అవలంబించుకోవడం ద్వారా శరీరానికి మనసుకి ఉపశమనాన్నిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ కనీసం 45-50 నిమిషాల యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని తెలిపారు. వ్యాయామంతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు.
మంత్రి, కలెక్టర్, అధికారులు ఆయుష్ సిబ్బంది, క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసియోగాసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ గోపాలరావు, కౌన్సిలర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
