గుంటూరు జిల్లా మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ చేపట్టిన బీసీ ధర్మదీక్ష మూడో రోజు ఉద్రిక్తతకు దారితీసింది. నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు వెల్లడించగా, దీక్షా శిబిరం వద్ద జరిగిన రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితి అదుపుతప్పింది.
దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, బీసీలకు సంబంధించిన ఐదు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేశారు. దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా పలు నాయకులు, ప్రజాసంఘాలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి.
