మధురవాడలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల అస్సాం జూ నుంచి జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చిన ఏడేళ్ల మగ ఆసియాటిక్ సింహం ‘లియో’ మంగళవారం మృతి చెందింది.
అస్సాం నుంచి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉన్న ఈ సింహానికి మార్చి 19న చేసిన పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లికియోసిస్ వంటి ప్రమాదకర హీమోప్రోటోజోయన్ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధుల కారణంగా అవయవాలు క్రమంగా పనిచేయకపోవడంతో పరిస్థితి విషమించింది.నిపుణులైన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం చికిత్స అందించినప్పటికీ లియోను రక్షించలేకపోయామని జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు.
