చింతపల్లి గ్రామదేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన చింతపల్లి గ్రామం భక్తి వాతావరణంలో మునిగిపోయింది.

ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి వినాయకరావు, ఉపాధ్యక్షుడు పోతురాజు బాలయ్య ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతుల్లో జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, శోభాయమానంగా అలంకరించిన అమ్మవారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, క్యూలైన్లు, పారిశుద్ధ్య, భద్రతా ఏర్పాట్లు విస్తృతంగా చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

