ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ సందర్భంగా హైకోర్టులో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, ఠాకూర్ న్యాయసేవలో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
జస్టిస్ ఠాకూర్ తన పదవీకాలంలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక ఆధునికీకరణ, న్యాయవ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కోర్టు భవనాల నిర్మాణం, డిజిటల్ సేవల ప్రవేశపెట్టడం వంటి పలు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు.తన వీడ్కోలు ప్రసంగంలో జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ, న్యాయ స్వాతంత్ర్యం ప్రతి పౌరుడి హక్కు అని, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం అత్యంత ముఖ్యమని అన్నారు. న్యాయమూర్తులు నిష్పాక్షికతతో పనిచేయాలని, న్యాయం ఆలస్యం కాకుండా అందించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
