తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, నెలరోజులుగా రైతులు ధాన్యం తీసుకువస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొనుగోళ్లు జరగలేదని ఆరోపించారు.
మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కొనుగోళ్లు ఆలస్యం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, విద్యుత్ సరఫరా, ధాన్యం కొనుగోళ్లు అన్నీ విఫలమయ్యాయని విమర్శించారు.

వడ్ల కొనుగోళ్ల కోసం వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి, రైస్ మిల్లులు కేటాయించాలని, రూ.500 బోనస్‌తో కలిపి కనీస మద్దతు ధరను రూ.2350గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతులతో కలిసి ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.ఎల్‌నినో ప్రభావంతో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల ధాన్యం నష్టపోకుండా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కేటీఆర్ కోరారు.
