విజయనగరం జిల్లాలో డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కలిసి సోమవారం పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మొదటగా పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ హనుమాన్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన అధికారులు, అనంతరం డెంకాడ మండలం రామచంద్ర ఏజెన్సీస్ బంకును సందర్శించి డీజిల్ నిల్వలు, సరఫరా పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిత్య వినియోగదారులకు అవసరాల మేరకు డీజిల్ సరఫరా చేయాలని, పెద్ద మొత్తాల్లో నిల్వ చేసుకునేందుకు క్యాన్లు లేదా ట్యాంకులతో వచ్చే వారికి ఇంధనం ఇవ్వవద్దని బంకు నిర్వాహకులకు ఆదేశించారు. ప్రజలు అపోహలకు లోనవకుండా సాధారణంగా వ్యవహరించాలని సూచించారు.జిల్లాలో ఐదు బంకుల్లో తాత్కాలికంగా డీజిల్ నిల్వలు లేకపోయినా, ఈరోజు సాయంత్రానికి కొత్త స్టాక్ చేరుకోనుందని తెలిపారు. మిగతా బంకుల్లో మూడు నుంచి నాలుగు రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అవసరమైతే బంకుల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని కూడా మోహరించనున్నట్లు తెలిపారు.
