ఐపీఎల్‌లో ‘గర్ల్‌ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాలు లీక్ అవుతున్నాయనే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆటగాళ్ల ‘గర్ల్‌ఫ్రెండ్ కల్చర్’ వల్ల జట్టులోని అంతర్గత విషయాలు బయటకు పొక్కుతున్నాయనే ఆందోళనతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.
ఆటగాళ్లతో తిరుగుతున్న స్నేహితురాళ్లలో చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీరిలో కొందరు గతంలో బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేశారు. వీరు ఆటగాళ్లతో కలిసి ఉండటం వల్ల జట్టుకు సంబంధించిన సున్నితమైన సమాచారం పబ్లిక్ అయ్యే ప్రమాదం ఉందని బోర్డు ఆందోళన చెందుతోంది. ఆటగాళ్లు డేటింగ్ చేయడాన్ని బీసీసీఐ తప్పుబట్టడం లేదు. కానీ, వారి స్నేహితురాళ్లు జట్టుతో పాటే ప్రయాణించడం, వారితో పాటే ఒకే హోటల్‌లో బస చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో కనిపించడాన్ని బీసీసీఐ గమనించినట్లు నివేదిక పేర్కొంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ మీడియా మేనేజర్ డగౌట్‌లో ఫోన్ వాడటం, కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (vaping) చేయడం వంటి ఘటనల నేపథ్యంలో బీసీసీఐ మరింత అప్రమత్తమైంది. భార్యలు, కుటుంబ సభ్యులు జట్టుతో పాటు రావడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ‘గర్ల్‌ఫ్రెండ్స్’ విషయంలోనే సమస్య వస్తోందని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) అధికారులతో దీనిపై చర్చించారు. భవిష్యత్తులో ACU నిబంధనలను మరింత కఠినతరం చేయడమో లేదా గర్ల్‌ఫ్రెండ్స్ ప్రయాణించడాన్ని పూర్తిగా నిషేధించడమో చేసే అవకాశం ఉంది.
