3 పార్టీల నుండి ముగ్గురు విజేతలు.. లాటరీ కింగ్ కుటుంబానికి కలిసొచ్చింది

May 5, 2026 1:42 PM

‘లాటరీ కింగ్’ గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ (Santiago Martin) కుటుంబానికి గొప్ప విజయం దక్కింది. ఇటీవల జరిగిన తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వరించింది. ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం.

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన నాయకుడు ఆధవ్ అర్జున (శాంటియాగో మార్టిన్ అల్లుడు, డైసీ మార్టిన్ భర్త). టీవీకే పార్టీ ఎన్నికల విజయానికి జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన, విల్లివాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,302 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోస్ మార్టిన్ తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే (AIADMK) టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆమె సుమారు 2,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

శాంటియాగో మార్టిన్ కుమారుడు, వ్యాపారవేత్త అయిన జోస్ చార్లెస్ మార్టిన్ గత డిసెంబర్‌లో ‘లచ్చియ జననాయక కట్చి’ అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ అధికార ఎన్‌డీఏ (NDA) కూటమిలో భాగంగా పుదుచ్చేరిలో రెండు స్థానాల్లో పోటీ చేయగా, అందులో ఒక స్థానంలో గెలుపొందింది. కామరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జోస్ చార్లెస్ మార్టిన్, తన తొలి ఎన్నికల్లోనే 10,205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలవడం ఎన్నికల చరిత్రలో ఒక ఆసక్తికర పరిణామం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media