తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని అడ్డంకి ఎదురైంది. దీనికి ఆయనకున్న రాజకీయ అనుభవలేమి, చేసిన ఒక చిన్న పొరపాటే కారణమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతు తెలపడంతో ఆ బలం 112 కి చేరింది. ఆ తర్వాతే వీసీకే (VCK – 2 స్థానాలు), వామపక్షాలు (4 స్థానాలు) తమ మద్దతు ప్రకటించాయి.
నిపుణుల ప్రకారం, విజయ్ మే 6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు మద్దతు లేఖను సమర్పించినప్పుడు, అందులో టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో పాటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా కలిపి సమర్పించడం అతిపెద్ద పొరపాటు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే నేతగా విజయ్.. కేవలం తమ 108 మంది ఎమ్మెల్యేల సంతకాలతోనే ప్రభుత్వ ఏర్పాటుకు వెళ్లి ఉండాల్సింది. కానీ కాంగ్రెస్ సభ్యుల సంతకాలను కూడా జతచేయడం ద్వారా అది ‘సంకీర్ణ ప్రభుత్వ’ ఏర్పాటుకు ముందుకు వెళ్లినట్లు అయ్యింది. దీనివల్ల గవర్నర్ ఆయన ప్రతిపాదనను తిరస్కరించి, సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైన 118 మంది పూర్తి మద్దతు లేఖతో రావాలని వెనక్కి పంపారు.
ఆ తర్వాత గవర్నర్‌తో జరిగిన రెండవ భేటీ కూడా ఫలితాన్నివ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజారిటీని చూపించడంలో విజయ్ విఫలమయ్యారని రాజ్‌భవన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సరైన రాజకీయ సలహాదారులు ఉండి ఉంటే ఆయన ఈపాటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఉండేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరియైన వ్యూహం లేకుండా, ఇతర చిన్న పార్టీల (VCK, Left) మద్దతును ముందే కూడగట్టుకోకుండా గవర్నర్‌ను కలవడం వల్లే ప్రభుత్వ ఏర్పాటులో ఈ ఇబ్బంది తలెత్తిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
