ఒడిశా ఆకాశంలో మిస్టరీ రాకెట్

May 9, 2026 4:57 PM

మే 8 సాయంత్రం ఒడిశా ఆకాశంలో ఒక వింత వెలుగు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పొడవైన, నారింజ-తెలుపు రంగు తోకతో కూడిన తోకచుక్క లాంటి ప్రకాశవంతమైన వస్తువు ఆకాశంలో వేగంగా దూసుకెళ్లడాన్ని ప్రజలు గమనించారు. ఇది కేవలం ఒడిశాలోనే కాకుండా, ప్రయోగ వేదికకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ వరకు కూడా కనిపించింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒడిశా తీరంలోని చండీపూర్‌లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి (ITR) నుంచి మే 8వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల మధ్య భారతదేశం ఒక క్షిపణి (Missile) ని ప్రయోగించింది. ఇది అణు సామర్థ్యం గల అగ్ని-5 (Agni-5) ఖండాంతర క్షిపణికి చెందిన అధునాతన వెర్షన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

భారతదేశం అంతకుముందు మే 1న 1,500 కిలోమీటర్ల దూరంలోని సముద్ర లక్ష్యాలను ఛేదించగల ‘లాంగ్-రేంజ్ యాంటీ-షిప్ హైపర్‌సోనిక్ క్షిపణి’ని పరీక్షించింది. ఆ పరీక్ష కోసం బంగాళాఖాతంలో సుమారు 1,680 కి.మీ మేర నోటామ్ (NOTAM – విమానాల పైలట్లకు జారీ చేసే హెచ్చరిక) జారీ చేశారు. కానీ మే 8న జరిగిన ఈ తాజా ప్రయోగానికి ఏకంగా 3,560 కిలోమీటర్ల మేర నోటామ్ జారీ చేశారు. దీన్ని బట్టి ఇది అంతకంటే చాలా ఎక్కువ పరిధి గల భారీ క్షిపణి వ్యవస్థ అయి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మే 8న పరీక్షించిన క్షిపణి గురించి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media