భగీరథ్ ఎదురు ఫిర్యాదు.. బండి సంజయ్ చెబుతోంది ఇదే!!

May 10, 2026 8:03 AM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఆయనపై పోక్సో కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని సదరు యువతి కుటుంబం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లి శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో బండి భగీరథ్ (24), తన కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి బాలిక డిప్రెషన్‌లో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైందని ఆమె తల్లి పోలీసులకు వివరించారు.

సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుల ద్వారా పరిచయమైన ఆమెతో స్నేహపూర్వక సంబంధం ఉందని, ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు. సదరు బాలికతో తన స్నేహితులు కూడా వేధింపులు ఎదుర్కొన్నారని, వారి ఫిర్యాదుతో ఏప్రిల్ 21న నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైందని భగీరథ్ తెలిపారు. ఈ పరిణామాలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుమారుడిని వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తాను కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేని శక్తులు పన్నిన కుట్ర ఇదని, న్యాయవ్యవస్థే నిజానిజాలు తేలుస్తుందని అన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media