ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడబోతున్నాయ్. నైరుతి బంగాళాఖాతంలో, ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని, ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వీఆర్ పురం, గుర్తేడు వంటి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉండనుంది.
