అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 82 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గుజరాత్ బౌలర్ల ధాటికి 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్‌గా వెనుదిరగడంతో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగలేదు. కగిసో రబడా (3/28), జాసన్ హోల్డర్ (3/20) హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ పాట్ కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 61), వాషింగ్టన్ సుందర్ (33 బంతుల్లో 50) హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు. గుజరాత్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
