ప్రధాని కాన్వాయ్ లో ఊహించని మార్పులు

May 13, 2026 11:40 AM

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పలు త్యాగాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన కూడా అది పాటించడానికి ఫిక్స్ అయిపోయారు. పొదుపు, ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ప్రోటోకాల్స్‌కు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటూనే, ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)కి ఆదేశాలు జారీ చేశారు. SPG ఇప్పటికే ఈ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించింది. కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రధాని మోదీ కోరారని, అలాగే ఈ మార్పు కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.

పెరుగుతున్న ప్రపంచ చమురు ధరల వల్ల కలిగే ఆర్థిక పరిణామాలకు భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండటం, అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ పౌరులకు విజ్ఞప్తి చేసిన కొద్ది రోజులకే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ ఇటీవల గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల పర్యటనల సందర్భంగా తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని పొదుపునకు పిలుపునిచ్చిన వెంటనే, వడోదర, గౌహతిలలో ఈ కుదించిన కాన్వాయ్‌లు కనిపించాయి. ఎస్పీజీ ప్రోటోకాల్ కింద తప్పనిసరి భద్రతా అవసరాలను పూర్తిగా పాటిస్తూనే వాహనాల సంఖ్యను తగ్గించారు.

హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇరాన్ యుద్ధం వల్ల దేశం విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి ప్రజలు పొదుపు చర్యలు చేపట్టాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో రైలు సేవలను, కార్‌పూలింగ్‌ను, ఎలక్ట్రిక్ వాహనాలను, రైల్వే పార్శిల్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. సాధ్యమైన చోటల్లా ఇంటి నుంచే పని చేసే పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media