మోదీ కార్టూన్‌పై నార్వే పత్రికకు విమర్శలు

May 20, 2026 11:03 AM

ప్రధాని నరేంద్ర మోదీని పాము ఆడించే వ్యక్తిగా చూపిస్తూ నార్వే దినపత్రిక ప్రచురించిన కార్టూన్‌ వివాదానికి దారి తీసింది. అవమానకరంగా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత వలసవాద భావజాలాన్ని గుర్తుచేసేలా ఈ చిత్రణ ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నార్వేలో అతిపెద్ద ముద్రిత పత్రిక అయిన ‘ఆఫ్టెన్‌పోస్టెన్‌’ ఈ కార్టూన్‌ను ప్రచురించింది. ఇందులో ప్రధాని మోదీ పుంగి వాయిస్తూ కనిపించారు. పెట్రోల్‌ బంక్‌ నాజిల్‌ ఆకారంలో ఉన్న పామును ఆయన అదుపులోకి తెస్తున్నట్లుగా చిత్రించారు. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును ఉద్దేశించేలా ఈ వ్యంగ్య చిత్రం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఈ కార్టూన్‌ను “తెలివైన, కొంత ఇబ్బంది పెట్టే వ్యక్తి” అనే అర్థం వచ్చే నార్వేజియన్‌ శీర్షికతో వచ్చిన అభిప్రాయ కథనానికి జత చేశారు.

ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ప్రధాని కార్యాలయం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. ఇదే తరహా వివాదం 2022 అక్టోబర్‌లో కూడా చోటుచేసుకుంది. అప్పట్లో స్పెయిన్‌కు చెందిన ‘లా వాంగార్డియా’ పత్రిక.. భారత ఆర్థిక వృద్ధిపై కథనంలో పాము ఆడించే వ్యక్తి ప్రతీకను ఉపయోగించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media