ట్విషా శర్మ మృతి హత్య కాదు: భోపాల్‌ పోలీసులు

May 20, 2026 11:53 AM

ముగ్గురు మొనగాళ్లు తెలుగు సినిమా హీరోయిన్ కొత్తగా పెళ్లైన ట్విషా శర్మ మృతి కేసులో ఇది హత్య కాదని, ఆత్మహత్యేనని భోపాల్‌ పోలీసులు స్పష్టం చేశారు. అయితే వరకట్న వేధింపులు, మానసిక ఇబ్బందుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆమె భర్త సమర్థ్‌ సింగ్‌, అత్త గిరిబాలా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోస్ట్‌మార్టం నివేదికతో పాటు ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం ఇది ఆత్మహత్య కేసేనని భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. “ఇది హత్య కాదని ఇప్పటివరకు దర్యాప్తులో స్పష్టమైంది. పోస్ట్‌మార్టం వివరాలు కూడా అదే చెబుతున్నాయి” అని చెప్పారు.

నోయిడాకు చెందిన ట్విషా శర్మ ఈ నెల 12న భోపాల్‌లోని అత్తింట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. కట్నం కోసం అత్తింటి వారు మానసికంగా వేధించారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.

“దర్యాప్తు ప్రకారం ఇది యాంటీ మార్టమ్‌ హ్యాంగింగ్‌ కేసు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ఆత్మహత్య వైపే చూపిస్తున్నాయి” అని కమిషనర్‌ వివరించారు.

ట్విషా భర్త సమర్థ్‌ సింగ్‌ భార్య మృతి తర్వాత కనిపించకుండా పోయాడు. మరోవైపు రిటైర్డ్‌ జడ్జి అయిన అత్త గిరిబాలా సింగ్‌.. ట్విషాకు గంజాయి అలవాటు ఉందని, గ్లామర్‌ రంగంలోకి కుటుంబమే పంపిందని ఆరోపించారు.

అయితే ఈ వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. “పోస్ట్‌మార్టం నివేదికలో డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించిన ఎలాంటి వివరాలు లేవు. మా దర్యాప్తులో కూడా అలాంటి ఆధారాలు దొరకలేదు” అని సంజయ్‌ కుమార్‌ చెప్పారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు ఆలస్యమైందన్న ఆరోపణలను కూడా కమిషనర్‌ తిరస్కరించారు. రెండో పోస్ట్‌మార్టానికి అనుమతి ఇచ్చి, తర్వాత వెనక్కి తీసుకున్నారన్న ట్విషా కుటుంబ ఆరోపణలపై స్పందిస్తూ.. “అలాంటి అనుమతి ఇచ్చే అధికారం పోలీసులకు లేదు. రెండో పోస్ట్‌మార్టం కావాలంటే కోర్టును ఆశ్రయించాలి. కుటుంబ సభ్యుల దరఖాస్తును కేసు డైరీలో చేర్చాం” అని తెలిపారు.

ట్విషా కుటుంబం ఇప్పటివరకు మృతదేహాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్లలేదు. రెండో పోస్ట్‌మార్టం చేయాలన్న డిమాండ్‌పై వారు పట్టుదలగా ఉన్నారు. అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న ప్రశ్నకు.. “ఈ విషయంలో పోలీసుల పాత్ర పరిమితమే” అని కమిషనర్‌ చెప్పారు.

ట్విషా ఉరివేసుకోవడానికి ఉపయోగించిందని భావిస్తున్న బెల్ట్‌ పోస్ట్‌మార్టం సమయంలో ఆస్పత్రికి చేరకపోవడంపై కూడా కమిషనర్‌ స్పందించారు. “ఈ విషయం తెలిసిన వెంటనే బెల్ట్‌ను ఆస్పత్రికి పంపించాం. దానిపై నివేదిక కూడా తీసుకున్నాం. దీనివల్ల దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం ఉండదు. ఈ అంశంపై ప్రత్యేక విచారణ చేస్తాం” అని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media