థాయ్‌లాండ్‌లో 30 రోజులకు మించి ఉండాలనుకునే బ్రిటన్ పౌరులు ఇకపై వీసా తీసుకోవాల్సి ఉంటుంది. యూకేతో పాటు మరో పలుదేశాల పౌరులకూ ఇదే నిబంధన వర్తించనుంది.
కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం 2024 జూలై నుంచి 93 దేశాల పర్యాటకులకు 60 రోజుల వరకు వీసా మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది.
భద్రతా కారణాలే ప్రధానంగా..
ఇకపై విదేశీయులు ఎంతకాలం వీసా లేకుండా ఉండొచ్చన్నది ఆయా దేశాలతో ఉన్న పరస్పర ఒప్పందాల ఆధారంగా నిర్ణయిస్తామని థాయ్ విదేశాంగ శాఖ తెలిపింది. కొన్ని దేశాలకు 30 రోజుల కంటే తక్కువ, మరికొన్నింటికి ఎక్కువ గడువు ఉండొచ్చని పేర్కొంది.
దక్షిణాసియా దేశమైన థాయ్‌లాండ్‌లో ఇటీవలి కాలంలో విదేశీయుల అరెస్టులు పెరిగాయి. మాదకద్రవ్యాలు, సెక్స్ ట్రాఫికింగ్ కేసుల్లో పలువురు పట్టుబడ్డారు. భద్రతా సమస్యలు, ప్రస్తుత వీసా విధానంలో ఉన్న గందరగోళం వల్ల మార్పులు అవసరమయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రధాని అనుతిన్ చార్న్‌విరకుల్ మాట్లాడుతూ.. “ఆర్థిక పరిస్థితులు, జాతీయ భద్రత దృష్ట్యా ప్రస్తుత విధానాన్ని సవరించాల్సిన అవసరం వచ్చింది” అని చెప్పారు.
ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, స్పెయిన్, అమెరికా పౌరులు ఇప్పటివరకు 60 రోజుల వీసా మినహాయింపు పొందుతున్న దేశాల్లో ఉన్నారు.
కొత్త వీసా విధానం రాయల్ గెజెట్‌లో ప్రచురితమైన 15 రోజుల తర్వాత అమల్లోకి రానుంది. అక్కడే ప్రభుత్వ చట్టాలు, నియంత్రణల ప్రకటనలు వెలువడతాయి.

