నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ పూర్తిగా లీక్ కాలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఇటీవలి నీట్ వివాదంపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైన ఎన్‌టీఏ అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. పరీక్షలో అక్రమాలు, అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, దీనిని పూర్తిస్థాయి పేపర్ లీక్‌గా పరిగణించలేమని వారు కమిటీకి తెలిపారు. అవకతవకల విషయంలో తమది జీరో-టాలరెన్స్ విధానమని, అందుకే విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఎన్‌టీఏ అధికారులు పేర్కొన్నారు.
రద్దు చేసిన నీట్-యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం గానీ, అదనపు ఫీజు చెల్లించడం గానీ అవసరం లేదని, పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాజస్థాన్, హరియాణా, మహారాష్ట్రలలో 9 మందిని అరెస్ట్ చేసింది.

