భోజ్‌శాల తీర్పు తర్వాత ధార్‌లో హై అలర్ట్‌

May 22, 2026 1:39 PM

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల సముదాయం ఆలయమని హైకోర్టు తీర్పు ఇచ్చిన వారం రోజులకే అక్కడ భద్రతను జిల్లా యంత్రాంగం మరింత కట్టుదిట్టం చేసింది. గత శుక్రవారం వరకూ అక్కడ నమాజ్‌కు అనుమతి ఉండగా, ఇప్పుడు తొలి శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న “మసీదా.. ఆలయమా?” వివాదంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. భోజ్‌శాల సముదాయం సరస్వతి దేవికి అంకితమైన ఆలయమని పేర్కొంటూ హిందువులు పూజలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేసింది.

ఈ నేపథ్యంలో కొందరు శుక్రవారం ప్రార్థనలు నిర్వహించే ప్రయత్నం చేసే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య ధార్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. జీపుపై నిలబడి మాట్లాడిన ఆయన, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

“చట్టాన్ని సవాల్‌ చేయగలమని ఎవరికైనా అనిపిస్తే శుక్రవారం ప్రయత్నించండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. కఠిన చర్యలు తప్పవు” అని సచిన్ శర్మ చెప్పారు.

సోషల్‌ మీడియాలో కోర్టు ఉత్తర్వులపై తప్పుడు ప్రచారం చేయొద్దని కూడా ఆయన హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలు కాపాడుతామని స్పష్టం చేశారు. చివర్లో “భారత్‌ మాతాకీ జై” నినాదం చేయగా అక్కడున్నవారు స్పందిస్తూ నినాదాలు చేశారు.

2003 నుంచి భారత పురావస్తు సర్వే శాఖ (ఏఎస్‌ఐ) భోజ్‌శాల సముదాయంలో మంగళవారాల్లో హిందువులకు పూజలు, శుక్రవారాల్లో ముస్లింలకు నమాజ్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను హిందూ సంఘాలు సవాల్‌ చేశాయి. దీర్ఘకాల న్యాయపోరాటం తర్వాత మే 15న ఇండోర్‌ బెంచ్‌ హిందువుల పక్షాన తీర్పు ఇచ్చింది.

ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముస్లిం పక్షం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భోజ్‌శాల సముదాయం ఆలయమని ప్రకటించిన తీర్పును రద్దు చేయాలని కోరింది.

అదే సమయంలో మసీదు నిర్మాణానికి జిల్లా పరిధిలో వేరే స్థలం కేటాయించాలని ముస్లిం వర్గం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరవచ్చని హైకోర్టు సూచించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media