బెంగళూరు విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానానికి టెయిల్‌ స్ట్రైక్‌

May 22, 2026 4:18 PM
Air India A321 aircraft grounded at Bengaluru airport after tail strike incident.

ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో 181 మంది ప్రయాణికులు

తిరుగు విమానం రద్దు.. దర్యాప్తు ప్రారంభం

Air Indiaకు చెందిన ఓ విమానం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో టెయిల్‌ స్ట్రైక్‌కు గురైంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో విమానం సురక్షితంగా దిగింది. అందులో ఉన్న 181 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.

ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా AI2651 విమానం ఎయిర్‌బస్‌ A321 రకం న్యారోబాడీ విమానం. ల్యాండింగ్‌ సమయంలో విమానం వెనుక భాగం రన్‌వేను తాకినట్లు ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు.

విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. విమానం దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో సమీపంలో ఓ వైడ్‌బాడీ విమానం టేకాఫ్‌ కావడంతో “వేక్‌ టర్బులెన్స్‌” ఏర్పడింది. దీంతో పైలట్‌ “గో అరౌండ్‌” చర్య చేపట్టారు. ఆ సమయంలోనే టెయిల్‌ స్ట్రైక్‌ జరిగినట్లు చెప్పారు. అయితే ఆ వైడ్‌బాడీ విమానం వివరాలు వెల్లడికాలేదు.

ఈ ఘటన తర్వాత విమానాన్ని పూర్తిస్థాయి సాంకేతిక తనిఖీల కోసం నిలిపివేశారు. నియమావళి ప్రకారం సంబంధిత నియంత్రణ సంస్థల సమన్వయంతో దర్యాప్తు చేపడతామని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

ఈ ప్రభావంతో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన AI2652 తిరుగు విమానాన్ని రద్దు చేశారు. ప్రభావిత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రౌండ్‌ సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తున్నారని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

విమానాల కదలికలను పర్యవేక్షించే ఫ్లైట్‌రాడార్24 వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఈ సర్వీస్‌ను A321 విమానంతో నిర్వహించారు. అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) వివరాల ప్రకారం.. విమానం ఎగిరే సమయంలో వెనుక భాగంలో ఏర్పడే గాలి చక్రాల ప్రభావాన్నే “వేక్‌ టర్బులెన్స్‌”గా పేర్కొంటారు. ఇది సమీప విమానాల ప్రయాణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media