ఎవరెస్ట్‌ దిగుతూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి

May 22, 2026 5:00 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఇద్దరు భారతీయ పర్వతారోహకులు దిగుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నేపాల్‌ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ శుక్రవారం వెల్లడించింది.

నేపాల్‌ ఎక్స్‌పెడిషన్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రిషి భండారి మాట్లాడుతూ.. ఒక పర్వతారోహకుడు దిగుతున్న సమయంలో తీవ్ర అలసటకు గురయ్యాడన్నారు. “అతడి ప్రాణాలు కాపాడేందుకు షెర్పా గైడ్లు తీవ్రంగా శ్రమించారు. బాల్కనీ నుంచి సౌత్‌ కోల్‌ వరకు రాత్రంతా తరలించారు. అయినా అతడిని కాపాడలేకపోయాం” అని చెప్పారు.

మరో పర్వతారోహకుడు అరుణ్‌ తివారి గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకున్నారని భండారి తెలిపారు. “అతడితో ఇద్దరు అనుభవజ్ఞులైన షెర్పా గైడ్లు ఉన్నారు. కలిసి దిగుతుండగా హిల్లరీ స్టెప్‌ వద్ద తీవ్ర అలసటకు గురయ్యాడు. అతడిని తిరిగి తీసుకురావడం సాధ్యపడలేదు” అని వివరించారు.

దిగుతున్న సమయంలో నలుగురు షెర్పా గైడ్లు సహాయం చేస్తున్నప్పటికీ అరుణ్‌ తివారి హిల్లరీ స్టెప్‌ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. మరో పర్వతారోహకుడు సందీప్‌ ఆరేను షెర్పా రెస్క్యూ బృందం కిందకు తీసుకొచ్చింది. అయితే క్యాంప్‌-2 వద్ద అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇదిలా ఉండగా, 21 ఏళ్ల సానికా షా సహా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) మహిళల పర్వతారోహక బృందం విజయవంతంగా ఎవరెస్ట్‌ను అధిరోహించింది.

ఖుంబు ఐస్‌ఫాల్‌లో ఆలస్యాల వల్ల ఈ ఏడాది ఎక్కింపు సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మార్గాల ఏర్పాట్లు, సరకు రవాణాపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ బుధవారం ఒక్కరోజే నేపాల్‌ వైపు సౌత్‌ బేస్‌క్యాంప్‌ నుంచి రికార్డు స్థాయిలో 274 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకున్నారు.

శిఖరానికి వెళ్లే మార్గంలో కీలకమైన రోప్‌ ఫిక్సింగ్‌ ప్రక్రియ మే 13న పూర్తికావడంతో ఈ ఏడాది ఎక్కింపు సీజన్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టారు.

ఈసారి ఎవరెస్ట్‌పై రికార్డు స్థాయి ఎక్కింపులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు నేపాల్‌ అధికారులు ఈ ఏడాది 493 అనుమతులు జారీ చేశారు. 1953లో టెన్జింగ్‌ నోర్గే, సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ తొలిసారి ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించిన తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ సంఖ్యలో అనుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media