తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ప్రజాభవన్‌లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఈ క్రమంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళలు, దళిత, గిరిజన, యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని కోరారు.

