ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే విషయాన్ని పరిశీలించాలన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలన్నారు.

