మోదీతో మార్కో రుబియో భేటీ.. వైట్‌హౌస్‌కు ఆహ్వానం

May 23, 2026 4:44 PM

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్‌హౌస్‌కు రావాలని మోదీని రూబియో ఆహ్వానించారు.

నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా రూబియో శనివారం ఉదయం కోల్‌కతాకు చేరుకున్నారు. గత ఏడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. కోల్‌కతాలో మదర్ హౌస్‌ను సందర్శించిన ఆయన, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు.

ఆదివారం విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో రూబియో సమావేశం కానున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆగ్రా, జైపూర్‌లకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

“భారత్‌తో కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. భారత్‌ మా కీలక భాగస్వామి. ఇరు దేశాలు కలిసి మంచి పనులు చేస్తున్నాయి. అందుకే ఈ పర్యటనకు ప్రాధాన్యం ఉంది” అని భారత్‌ పర్యటనపై రూబియో శుక్రవారం వ్యాఖ్యానించారు.

అమెరికా-ఇరాన్ యుద్ధం, దాని ఆర్థిక ప్రభావాలపై కూడా ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధన సరఫరాలపై ప్రభావం అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారత్‌పై అమెరికా విధించిన సుంకాల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలపైనా చర్చలు జరగనున్నట్లు సమాచారం.

భారత్‌-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా రూబియో పర్యటనను భావిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల వేగం కొనసాగాలని ట్రంప్‌, మోదీ ఇద్దరూ వ్యక్తిగతంగా ఆసక్తి చూపుతున్నట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media