ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎక్కితే చాలు కొందరు అతివేగంతో ప్రయాణించడం మొదలుపెడతారు. అక్కడ కెమెరాలు ఉన్నాయన్న ధ్యాస కూడా ఉండదు. అయితే మితిమీరిన వేగంతో కారు నడిపి ఇతర ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన యువకుడిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. పుప్పాలగూడలోని అల్కాపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి ఈ నెల 10వ తేదీన నార్సింగి నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో యశ్వంత్ రెడ్డి తన కారును గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిపాడు. అంతటితో ఆగకుండా ఆ ప్రమాదకరమైన డ్రైవింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
సోషల్ మీడియాలో ఉన్న ఈ వీడియోను గమనించిన ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ ఆఫీసర్ కారింగుల సాయిరాం ఈ నెల 19న నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి కారును కూడా సీజ్ చేశారు. కొత్తగా కారు కొనుగోలు చేశానని, ఆ కారు హై స్పీడ్ ఎంతుందో పరీక్షించడానికే అంత వేగంగా నడిపినట్లు పోలీసుల విచారణలో యశ్వంత్ రెడ్డి అంగీకరించాడు.

