తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోరా?.. NTAపై సుప్రీం ఆగ్రహం

May 25, 2026 3:52 PM

ఎన్నిసార్లు చెప్పినా NTA మారదా? కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ వ్యవస్థకు గత వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం చేతకాదా? నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు డైరెక్ట్‌గా NTA కాలర్ పట్టుకున్నంత పని చేసింది. గత తప్పుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి లెసన్స్ నేర్చుకోకపోవడం తీవ్ర విచారకరం అంటూ ధర్మాసనం ఊగిపోయింది.

2024లో నీట్ పేపర్ లీక్ అయి దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీ అయింది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. కట్ చేస్తే.. సీన్ రిపీట్. ఈసారి జరిగిన NEET ఎగ్జామ్ పేపర్ కూడా మళ్లీ లీక్ అయిపోయింది. ఇక ఈ NTA వల్ల ఏమీ కాదని డిసైడ్ అయిన ‘ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్’ (FAIMA) నేరుగా కోర్టుకెక్కింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగాలంటే.. ఈ NTAని ఇమీడియట్‌గా స్క్రాప్ చేసి, ఒక కొత్త ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో డిమాండ్ చేసింది.

దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం NTAకి చుక్కలు చూపించింది. గతంలో పేపర్ లీక్‌లపై నియమించిన కమిటీ సూచనలపై ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పాలని.. గురువారం లోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని NTAని ఆర్డర్ చేసింది. లీకేజీల వెనుక ఉన్న అసలు దొంగలెవరో తేల్చాలని అటు సెంట్రల్ గవర్నమెంట్‌కు, ఇటు సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది.

ఒకవైపు విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటే.. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీలతో కొందరు మెడికల్‌ సీట్లను వ్యాపారంగా మార్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా సుప్రీంకోర్టు కనువిప్పుతో NTA మారుతుందా? లేక విద్యార్థుల భవిష్యత్తు ఇలాగే ప్రశ్నార్థకం అవుతుందా? అన్న చర్చ సాగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media