బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ప్రకటించిన పద్మ విభూషణ్ను ఆయన తరఫున భార్య హేమామాలిని మే 25న స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్టు పెట్టారు. ఆ క్షణం ఎంతో వ్యక్తిగతంగా, హృదయాన్ని కదిలించేలా అనిపించిందని తెలిపారు.
“ఆ అవార్డు తీసుకోవడానికి వేదిక వైపు నడుస్తున్నప్పుడు ధరం జీ నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్లే అనిపించింది. ఆయన సాన్నిహిత్యాన్ని నేను అనుభవించాను” అని హేమ మాలిని పేర్కొన్నారు.
కలిసి గడిపిన రోజుల జ్ఞాపకాలు
పద్మ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి స్వయంగా అవార్డులు అందజేస్తున్న సమయంలో తాను ధర్మేంద్ర తరఫున అక్కడ కూర్చోవడం గర్వంగా అనిపించిందన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలు, తర్వాత జీవిత భాగస్వామిగా గడిపిన సంవత్సరాల జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయని చెప్పారు.
“ఆ ఆలోచనలు గుర్తుకొచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ప్రేమతో చూసుకునే భర్త. ఆప్యాయత కలిగిన తండ్రి, తాత. మంచి స్నేహితుడు, మార్గదర్శి” అని హేమ మాలిని రాశారు.
ధర్మేంద్రను అందరూ అభిమానించే మంచి మనసున్న వ్యక్తిగా ఆమె అభివర్ణించారు. కుటుంబ సభ్యులు, అభిమానుల తరఫున ఎంతో వినమ్రంగా ఈ గౌరవాన్ని స్వీకరించానని తెలిపారు.
“నా జీవితంలో అద్భుతమైన జీవిత భాగస్వామిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ఆయన జ్ఞాపకాలను జీవితాంతం మర్చిపోలేను” అని హేమ మాలిని పేర్కొన్నారు.
దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ను ధర్మేంద్ర తరఫున అందుకోవడం తనను భావోద్వేగానికి గురి చేసిందని ఆమె చెప్పారు.
ధర్మేంద్ర 2025 నవంబర్ 24న మరణించారు.

